KTR: 8న తొర్రూరులో కేటీఆర్ పర్యటన
KTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అనంతరం 20 వేల మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ లో కేటీఆర్ మాట్లాడతారని మంత్రి తెలిపారు. అదే రోజు కేటీఆర్ నోట డ్వాక్రా మహిళలకు శుభ వార్త చెప్పే అవకాశం ఉందని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా మహిళా సంఘాలు ఎదురుచూస్తున్న కలను సాకారం చేయనున్నారు. పావలావడ్డీ, అభయహస్తం చెక్కుల పం పిణీని ఈ వేదిక ద్వారా ప్రారంభించేందుకు యోచిస్తున్నారు.
కేటీఆర్ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి ఎర్రబెల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ సభ, జన సమీకరణ పై చర్చించారు. కేటీఆర్ రాక సందర్భంగా తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మాట్లాడారు. ఆ రోజు కేటీఆర్ ను అభ్యర్థించాల్సిన అంశాలపై చర్చించారు. ఇక ఇదే సమయంలో అటు అధికారులు, ఇటు పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. వారి వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించడం తో పాటు, పూర్తిగా తొర్రూరు లోనే ఉండి, ఆరోజు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.