KTR: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉద్యోగాలిచ్చేస్థాయి కి ఎదగాలి..కేటీఆర్
KTR: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. నేడు యూనివర్శిటీలో జరిగిన 5వ స్నాతకోత్సవంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకటరమణలతో పాటు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్టల్ బిల్డింగ్ పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ను, కొత్తగా కట్టిన 24 తరగతి గదులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఉద్యోగం సాధించాలనుకోవడం మంచిదే కానీ మరో పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని కొత్త.. కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించాలని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా యూనివర్శిటీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాంఛనంగా కొంతమంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలోనే అందజేస్తామని, మిగతా వారికి ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం 2,200 ల్యాప్ టాప్ లు, 1500 డెస్క్ టాప్ లు తెప్పించినట్లు మంత్రి వివరించారు. యూనివర్శిటీలో దాదాపు 70 శాతం మంది అమ్మాయిలేనన్న మంత్రి కేటీఆర్.. వారికోసం ప్రత్యేకంగా పది పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.