Harish Rao: ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీదే విజయం
Minister Harish Rao Predicts Victory of his Party for third time
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ లు ప్రధాన ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని, బీజేపీలో చేరినవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లేనని మంత్రి హరీశ్ రావు అన్నారు.మతతత్వ పార్టీలకు ఇక్కడ ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన ప్రగతి విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని నేర్చుకొని పోతున్నానని తెలిపారు. లకరం, డివైడర్, చెట్లు అన్నీ ఫోటోలు తీసుకొని తన ప్రాంతాన్ని అలానే అభివృద్ధి చేసుకున్నానని హరీశ్ రావు గుర్తుచేశారు.
పాత ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదని హరీశ్ రావు అన్నారు. ఒక్క ఖమ్మంలో మాత్రమే 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని హరీశ్ రావు గుర్తుచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూకట్ పల్లి నుంచి పోటీ చేయనున్నాననే ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ఖమ్మంలో ఉన్న ఒక పనికిమాలిన బ్యాచ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇక్కడి నుంచి పంపించి ప్రశాంతంగా ఉండాలని కొందరు చూస్తున్నారని అజయ్ ఫైర్ అయ్యారు.పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.