Errabelli Dayakar Rao: కేసీఆర్ తర్వాత నేనే..ఎర్రబెల్లి దయాకర్ రావు
Errabelli Dayakar Rao: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేల పై పలు వ్యాఖ్యలు చేయగా.. మరోసారి పంచాయితీ లో బీరుసీసాలపై మరో కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా సీఎం కేసీఆర్ తర్వాత సీనియర్ నేత ను నేనే అని మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు మంత్రి ఎర్రబెల్లి. వరుసగా 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అంటూ చెప్పుకొచ్చిన ఆయన గత 30 ఏళ్లుగా వరుస విజయాలతో రాజకీయాలలో సీనియర్ గా రాణిస్తున్నానని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 1987-1988 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. డాక్టర్ అవ్వాలని అనుకునేవాడినని కానీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. ఆటల్లో కూడా ఎప్పుడు తాను ముందుండే వాడినని, ఎన్నో బహుమతులను గెలుచుకునే వాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను టీడీపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లు చెప్పారు. కసి ఉండడం వల్లే తాను ఎన్నికల్లో ఏడుసార్లు గెలిచానని.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా పనిచేశానని తెలిపారు. రాజకీయాలలోకి తన తండ్రి ప్రోత్సాహంతో వచ్చానని, రాజకీయాలలో విజయం సాధించాలన్న కసితో, పట్టుదలతో తాను నేడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ప్రజల ఆదరణ, అభిమానం కారణంగా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.