కాంగ్రెస్ నేతల సమావేశం.. రాహుల్ టూర్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, శ్రీనివాస్, రేణుకా చౌదరి, దామోదర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఫైనల్ కావడంతో.. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల అమలు కోసం నేతలు చర్చిస్తున్నారు.
మే 6వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్న రాహుల్ గాంధీ.. అదే రోజు వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 7వ తేదీన హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొననున్న రాహుల్.. అమరవీరుల కుటుంబాలతో, ఉద్యోగాలు రాక సూసైడ్ చేసుకున్న యువకుల కుటుంబ సభ్యులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటూంబీకులతో రాహుల్ గాంధీ మాట్లాడ నున్నారు.