TPCC Politics: కొత్త ఇంఛార్జ్ కు సవాల్ – ఎన్నికల వేళ “సెట్” చేస్తారా..
Thakre will face a huge challenge to settle TPCC in Election Year: తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చారు. ఠాకూర్ వెళ్లి..ఠాక్రే వచ్చారు. మరి కాంగ్రెస్ ను సెట్ చేస్తారా. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్ర విభజన తరువాత మూడో సారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తోంది. బీజేపీ బలమైన ప్రత్యర్ధిగా ఎదిగింది. బలమైన కాంగ్రెస్ మూడో స్థానంలో కనిపిస్తోంది. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇచ్చిన తరువాత జోష్ వస్తుందని భావిస్తే, సమస్యలు పెరిగాయి. ఎప్పుడూ లేని విధంగా ఒర్జినల్ వర్సస్ వలసవాదుల కాంగ్రెస్ గా చీలక వచ్చింది. సీనియర్లు – జూనియర్లు అంటూ కేటగిరీలు మొదలయ్యాయి. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన సమయం నుంచి ప్రతీ సందర్భంలో పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ అండగా నిలిచారు.
దీంతో, టీ కాంగ్రెస్ సీనియర్లకు ఆయన టార్గెట్ అయ్యారు. పార్టీ కొత్త అధ్యక్షుడు ఖర్గే.. ఏఐసీసీ దూతగా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులు చక్కదిద్దేందుకు వచ్చిన దిగ్విజయ్ కు సీనియర్లు రేవంత్ తో పాటుగా మాణిక్కం ఠాకూర్ పైనే ఫిర్యాదులు చేసారు. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మార్పు పైన దిగ్విజయ్ సంకేతాలు ఇచ్చారు. దిగ్విజయ్ వెళ్లిన తరువాత పార్టీల మార్పు రాలేదు. ఇప్పుడు కొత్త ఇంచార్జ్ మహారాష్ట్రకు చెందిన ఠాక్రేను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీని నడిపించిన నాయకుడిగా అనుభవం ఉంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయ బాగా తెలిసిన వ్యక్తి. వచ్చే వారం ఆయన హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఇప్పుడు కొత్తగా ఇంఛార్జ్ గా నియిమితులైన ఠాక్రే సమకాలీకులు.
పార్టీలో వీరందరి అనుభవం దాదాపుగా ఒక్కటే. దీంతో, రేవంత్ – సీనియర్ల మధ్య అగాధం పూడ్చటం ఠాక్రేకు సాధ్యమేనా అనే సందేహం మొదలైంది. అటు కాంగ్రెస్ లో ఎవరైతే మనస్పూర్తిగా ఉండలేకపోతున్నారో..వారికి బీజేపీ ఆఫర్లు ఇస్తుంది. కాంగ్రెస్ తాము తెలంగాణ ఇస్తే కేసీఆర్ అధికారంలో ఉండటం ఒక సమస్య అయితే, బీజేపీ తమను దాటి పోయి తమ పార్టీ నేతలనే ఆకర్షించటం కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఒక సమయంలో పార్టీ ముఖ్య నేత ప్రియాంక స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షించాలని నిర్ణయించారు. మర్చి నుంచి ప్రియాంక కర్ణాటక – తెలంగాణ పైనే ఫోకస్ పెడతారని చెబుతున్నారు. ఖర్గే జోక్యం చేసుకున్నా.. పార్టీ సీనియర్లు రేవంత్ తో కలిసి పార్టీ సమావేశాలకు హాజరు కావటం లేదు. రేవంత్ సైతం ఇక డిసైడ్ అయిపోయారు. తన మాట సీనియర్లు వినరనే నిర్ణయానికి వచ్చేసారు.
దీంతో పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను పీసీసీ చీఫ్ పదవికి రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. ఎవరు ఆ పదవిలో ఉన్నా పల్లకి మోస్తానని చెప్పుకొచ్చారు. మనుషులుగా చేసే సహజమైన పొరపాట్లే జరిగాయని ఒక విధంగా వివరణ ఇచ్చుకున్నారు. కానీ, సీనియర్లు మెత్తబడటం లేదు. రేవంత్ కు వ్యతిరేంకగా వారంతా ఒకే మాట మీద ఉన్నారు. వారిని కొత్త ఇంఛార్జ్ వచ్చిన తరువాత సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉంది. దిగ్విజయ్ కు చెప్పిందే కొత్త ఇంఛార్జ్ కు చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ పదవుల కోసమే వర్గాలుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్ లో ఇక ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపులో ఇంకా ఎన్ని పంచాయితీలు చోటు చేసుకుంటాయనే ఆందోళన కనిపిస్తోంది. ఎన్నికల ముందు పార్టీ ఇంఛార్జ్ గా తెలంగాణలో అడుగు పెడుతున్న ఠాక్రే సమర్ధతకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరీక్ష పెట్టనున్నారు. ఠాక్రే ఈ పరిస్థితులను సెటిల్ చేయగలరా లేదా అనేది చూడాలి.