హైకమాండ్ చెప్పినా కాంగ్రెస్‌లో ఆగని లొల్లి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఇంకా వేడి తగ్గలేదు. ఏప్రిల్ 4న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతలు సమావేశమైయ్యారు. నేతలకు రాహుల్ పలు సూచనలు చేశారు. నేతలు మనస్పర్దలు వదిలేసి అందరూ కలిసి నడవాలని సూచించారు. అయినా పార్టీ నేతల తీరు మారలేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు తన ఆవేదనను బయటపెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను పట్టించుకోవడంలేదని, తాను పార్టీకి ప్రయోజనం చేకూరే సూచనలు ఇచ్చినా రేవంత్ తన మాటలు వినిపించుకోలేదన్నారు. దళితుల ఓట్ల గురించి మాట్లాడే నేతలు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు.
మరో వైపు రేవంత్ రెడ్డితో పాటు మాణిక్కం ఠాగూర్‌కు సైతం తాను చాలా సార్లు చెప్పానన్న వీహెచ్.. తన మాటలను ఆయన కుడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో తన మాటలు భట్టీ విక్రమార్క వినేవారన్న హనుమంతరావు.. తర్వాత ఆయన కూడా పట్టించులేదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు ఎత్తుకుపోయారని గతంలోనే కేసులు పెట్టినా.. ఇప్పటి వరకు ఛార్జిషిట్ వేయలేదన్నారు. పంజాగుట్ట దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిందేనని వీహెచ్ డిమాండ్ చేశారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. తన మాటలు వింటే తనకే క్రిడిట్ వస్తుంది అనుకుంటున్నారని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ మనిషినేనని హనుమంత రావు గుర్తు చేశారు.