ములుగు జిల్లాకు చెందిన కొందరి ఖాతాల్లో లక్షల రూపాయలు జమయ్యాయి. ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది ఖాతాల్లో రూ. వేల నుంచి లక్షల రూపాయల వరకు క్రెడిట్ అయ్యాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక జనాలు అయోమయంలో పడిపోయారు.
Mulugu: రాత్రికి రాత్రే తమ ఖాతా నిండిపోవాలని.. కోట్ల రూపాయలు వచ్చి పడాలని చాలా మంది అనుకుంటారు. అది సాధ్యమయ్యేది కాకపోయినా.. కొన్నికొన్నిసార్లు టెక్నికట్ ఇష్యూస్ వల్ల ఇతరుల డబ్బులు మరొకరి ఖాతాలో పడుతుంటాయి. ఇలానే కొందరి ఖాతాల్లో లక్షల రూపాయలు జమయ్యాయి. ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 50 మంది ఖాతాల్లో రూ. వేల నుంచి లక్షల రూపాయల వరకు క్రెడిట్ అయ్యాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక జనాలు అయోమయంలో పడిపోయారు. మరికొందరు తిరిగి బ్యాంక్ వాళ్లు తీసుకుంటారని మరొక ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన 50 మంది ఖాతాల్లో శనివారం డబ్బులు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి రూ. లక్ష వరకు క్రెడిట్ అయ్యాయి. అందరి ఫోన్లకు ఒకేసారి డబ్బులు పడినట్లు మెసేజ్ రావడంతో జనాలు షాక్ అయ్యారు. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. శనివారం నాలుగో శనివారం కావడంతో బ్యాంకులన్నీ క్లోజ్ ఉన్నాయి అయినప్పటికీ డబ్బులు పడడంతో అయోమయంలో పడిపోయారు. అయితే కొందరు మాత్రం ఆ డబ్బులను ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులను మరొక ఖాతాలోకి పంపించుకున్నారు.
ఇక ఉన్నఫలంగా డబ్బులు పడ్డాయనే వార్త క్షణాల్లో వైరల్‌గా మారింది. చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. అలా ఇంటెలిజెన్స్ అధికారుల వరకు వెళ్లింది. దీంతో అధికారులు ఆ వీధికి చేరుకొని.. ఆరా తీస్తున్నారు. డబ్బులు ఎవరు పంపించారు?.. ఏ ఖాతా నుంచి వచ్చాయి?.. మొత్తం ఎంతమంది ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి? అనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు.