KTR : పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు… కేటీఆర్ ఘాటు ట్వీట్
KTR Urges not to include children in politics: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం కాలికైన గాయం వల్ల రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరు కాలేకపోయారు. అయితే తాజాగా కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఆయన తన సోషల్ మీడియాలో రాజకీయాల్లోకి పిల్లలను లాగ వద్దని, ఇది సమర్ధనీయం కాదని, ఎవరు చేసినా కరెక్ట్ కాదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన ఒక వ్యక్తి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్ దయచేసి రాజకీయాల్లోకి పిల్లలను లాగ వద్దని కోరారు.
తాను టిఆర్ఎస్ కార్యకర్తలకు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని, దయచేసి రాజకీయాల్లోకి పిల్లల ప్రస్తావన తీసుకు రావద్దని కోరారు. ఏదైనా ఉంటే రాజకీయపరంగా ఎదుర్కొందామని, వ్యవస్థాగత నిర్ణయాల విషయం మీద చర్చిద్దాం, కానీ ఇలా పిల్లలను రాజకీయ వ్యవహారాల్లోకి తీసుకు వచ్చి, వారిని బద్నాం చేయవద్దని కోరారు. నిజానికి గతంలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి అప్పట్లో బీజేపీలో ఉన్న తీన్మార్ మల్లన్న ఇలాగే ప్రస్తావించడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు స్వయంగా టిఆర్ఎస్ నేతలు కూడా పిల్లలను రాజకీయాల్లోకి లాగుతూ ట్వీట్ చేయడం మీద కేటీఆర్ ఇలా ఘాటుగా స్పందించారు.