KTR: తెలంగాణకు పట్టిన శని బీజేపీ.. మహా నటుడు మోడీ!
KTR: తెలంగాణ పై కేంద్రం కక్ష గట్టిందన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని అన్నారు. మోడీ, ఈడీలకు భయపడమని ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని అన్నారు. కేసీఆర్ ను కాపాడుకుని మూడో సారి సీఎం చేసుకుందామన్న ఆయన తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు, 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు పాలించి ఏం చేశారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. పరిపాలించడం చేతకాని వారు ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక అబద్ధాలు చెప్పడం నటనలో మోడీ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్న ఆయన మహా నటుడు మోడీ అంటూ ఎద్దేవా చేశారు. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమచేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడని, ఆయన ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. నల్లధనం తెస్తానని ఇప్పుడు తెల్లమొఖం వేశారు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. బిజేపి వాళ్లు జనాన్ని నమ్ముకోలేదు, బిజేపి వాళ్ళు ఐటీ, ఈడీ, సిబిఐని నమ్ముకున్నారని అన్నారు. అందుకే ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి కాలం చెల్లిందని, బిజేపి వాళ్ళు సిబిఐ, ఈడిని పట్టుకొని పోరాడుతున్నారని అన్నారు.