Kishan Reddy Slams TRS and KCR: 11, 12 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో జాతీయ రహదారులకు భూమి పూజ , రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం, రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం ఉంటుందని, తెలంగాణలో రూ.9596 కోట్ల రూపాయల ప్రాజెక్టు లను ప్రారంభిస్తారని అన్నారు. రెండు రోజుల పర్యటనలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని వస్తున్నారని, తెలంగాణలో 2014 నుండి ఇప్పటి వరకు జాతీయ రహదారులను 1 లక్ష 4 వేల కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. రీజినల్ రింగు రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ఎంత త్వరగా పూర్తి చేస్తే రింగ్ రోడ్డు పనులు పూర్తవుతాయని, రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని అన్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకునేందుకు నీమ్ కోటెడ్ యూరియా ను ప్రవేశ పెట్టామన్న ఆయన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల తెలంగాణలో యూరియా కొరత లేకుండా పోయిందని అన్నారు.
యూరియా కోసం దేశంలో ఏ రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి లేఖలు రాయాల్సిన అవసరం లేదు. యూరియా తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం జరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యూరియా కొరత రాకుండా చూస్తున్నామని అన్నారు. రామగుండం పరిశ్రమ పునరుద్ధరణ కోసం 6 వేల 300 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది, 300 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, కార్మికుల కోసం టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం తగ్గించేందుకు ప్రధాని ఆదేశాలతో గ్రీనరీ పెంచే ప్రయత్నం చేస్తున్నామని, 50 కేజీల బస్తా యూరియా తయారీ ఖర్చు 3 వేలు అయితే రైతులకు కేవలం 600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నామని అన్నారు. అనేక రకాలుగా ఏర్పడిన సమస్యలను అధిగమించి గత రెండు మూడు నెలల నుండి ట్రయల్ రన్ చేసి విజయవంతం అయ్యామని అన్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేరుతో పరిశ్రమ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పనులు చేసి విఫలం అయ్యిందని ఆయన అన్నారు. ప్రధాని తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎంకు ఆహ్వాన లేఖ పంపాము. శంకుస్థాపన కు వచ్చిన సీఎం … ప్రారంభోత్సవానికి రావడానికి సాకులు చెబుతున్నారని, కేంద్ర మంత్రి స్వయంగా లేఖ రాసారని అన్నారు. ప్రధాని పర్యటన గురించి కేసీఆర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తుంది . ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు పలువురిని రెచ్చగొట్టి ధర్నాలు చేయమని ప్రోత్సాహిస్తున్నారని అన్నారు. విభజన హామీలు చేయలేదని సీపీఐ నాయుకులు ఆరోపిస్తున్నారు. సిధ్ధాంతాల ఆధారంగా రాజకీయ పార్టీలు పనిచేయాలి . కుటుంబ సిద్ధాంతాలు , స్వప్రయోజనాల ఆధారంగా పార్టీలు పనిచేయకూడదని అన్నారు.