Kishan Reddy: వేయి మంది కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా మోదీని అడ్డుకోలేరు
Kishan Reddy Slams Telangana Governemnt: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ప్రారంభ సభ్యలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ పాలనకు సమయం చెల్లిందని అసలు కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నాడో… ఫార్మ్ హౌజ్ లో ఉన్నాడో తెలీదని అన్నారు. ఇవాళ 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నాం, ఇప్పటికే 4 విడతల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేశామని, అడుగడుగునా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు పోలేదు. ఇక్కడ మాత్రం ఉద్యమంలో జైలుకు వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. మీ కుటుంబ, అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామన్న ఆయన నిన్న ఆడబిడ్డ అని కూడా చూడకుండా వైఎస్ షర్మిల వాహనాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణను అప్పుల తెలంగాణ, మద్యం తెలంగాణగా కేసీఆర్ మార్చేశారని, ఒక్క గ్రామంలో 30 బెల్ట్ షాప్ లు ఉన్నాయి. ఇది కేసీఆర్ సాధించిన ఘనత అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ప్రధాని, గవర్నర్, రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులపై గౌరవం ఉండదన్న ఆయన యాత్రను అడ్డుకుంటూ… అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
కేసీఆర్ ఆదేశాలతో… Trs పార్టీ ఏజెంట్స్ లా పోలీసులు వ్యవహరిస్తున్నారని, అందుకే తెలంగాణలో కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందని అన్నారు. ఇక ఎవరూ శాశ్వతం కాదన్న ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేసీఆర్ కు రాదన్నారు. బీఆర్ఎస్ పెట్టి నరేంద్రమోదీ ని కేసీఆర్ అడ్డుకుంటాడా? వేయి మంది కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ లు వచ్చినా నరేంద్రమోదీ ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. కేసీఆర్ చేసిన అనేక అవినీతి కుంభకోణాల మీద… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, ప్రతి అవినీతి పై దర్యాప్తు చేస్తాం. ప్రజలకు పంచుతామని అన్నారు.