Kishan Reddy: దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్ వ్యాఖ్యలు.. ప్రమాదంలో తెలంగాణా!
Kishan Reddy on KCR: ఖమ్మం సభలో కేసీఆర్, ఇతర ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటల మీద ఢిల్లీ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభలో కేసీఆర్, ఇతర ముఖ్యమంత్రులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఆయన విమర్శించారు. లక్ష్యం లేకుండా పని చేస్తుంది కేసీఆర్ అని 9 సంవత్సరాలుగా ఆఫీస్ కు రాకుండా పాలించిన వ్యక్తి ఆయనేనని అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కల్వకుంట్ల కుటుంబం కోసం ఆయన అంతరాత్మ పరితపిస్తోంది అని అన్నారు. కొడుకు సీఎం కావాలని, అధికారం చేయి జారోద్దని ఆరాటం తప్ప మరేం లేదని ఆయన అన్నారు. సీఎంగా పనికి రాడని అంటూనే దేశం పిలుస్తోంది అంట, అలా అని దేశాన్ని అవమానించొద్దు అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం వల్లే తెలంగాణలో అనేక పరిశ్రమలు వచ్చాయని, కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఎదుర్కొందని ఆయన అన్నారు. సకాలంలో వ్యాక్సిన్ తీసుకువచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని పేర్కొన్న ఆయన 2014కి ఇప్పటికి పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు తగ్గలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నష్టాల్లో ఉందని కానీ కేసీఆర్ మాటలు చూస్తుంటే, ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల వాగ్ధానాల్లా ఉన్నాయని అన్నారు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని చనిపోతున్నారని, మీ మనుమడిని నెలవరోజులు ప్రభుత్వ హాస్టల్లో ఉంచితే తెలుస్తుందని అన్నారు. వెలుగు జిలుగులు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో మాత్రమే ఉందని తెలంగాణను అన్ని రంగాల్లో దోచుకుంటున్నారని అన్నారు. మోడీ ప్రధానిగా ఒక్క రోజు సెలవు తీసుకోలేదని కిషన్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయితీల్లో మనరేగా నిధులు కేంద్రం ఇస్తుంది కాబట్టి అభివృద్ధి జరుగుతోందని, పంచాయితీ లకు కేంద్రం నిధులు ఇస్తే దారి మళ్లించారని అన్నారు తెలంగాణలో దోచుకుంది సరిపోలేదని, దేశంలోకి వస్తోంది బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. పీఎం కుర్చీ ఖాళీగా లేదు.. మీరు కూర్చున్న కుర్చీ ఖాళీ అవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. అలాగే దేశం కాదు తెలంగాణ సమాజము ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు.