Kishan Reddy: మూడు నెలల్లో పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకు ?
Kishan Reddy comments: తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై స్పందించిన కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు అని ఆయన విమర్సించారు. రిపబ్లిక్ వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారన్న ఆయన
రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనేక ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోంది, అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయని అన్నారు. రిపబ్లిక్ వేడుకలు గవర్నర్ జరపకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది, అంబేడ్కర్ ను, రాజ్యాంగాన్ని కెసిఆర్ అవమానపరిచారని అన్నారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కెసిఆర్ డుమ్మా కొడుతున్నారు, రాష్ట్రపతి, గవర్నర్ ను అవమానపరుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయన్న ఆయన ఎవరూ ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదన్నాడు. ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం ఈరోజు తెలంగాణలో జరుగుతుందని అన్నారు. జి20 సదస్సుకు రారు, ప్రధానమంత్రి వస్తే స్వాగతానికి రారు అని ఆయన పేర్కొన్నారు. మహిళా గవర్నర్ గౌరవించాల్సిన బాధ్యత అందరి పైన ఉన్నది కానీ గవర్నర్ పర్యటన లకు వెళ్తే, కనీసం ప్రోటోకాల్ పాటించటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజా సంఘాలను కలవడు, ఎమ్మెల్యేలను కలవడం లేదు, ఎంపీలను కలవడు ఈ కెసిఆర్, కల్వకుంట్ల కుటుంబ కారణంగా తెలంగాణ పరువు పోతుందని అన్నారు.
దేశానికి ఒక విధానం తెలంగాణకు ఒక విధానం ఉండదన్న ఆయన అందరు ముఖ్యమంత్రులకు ఉన్న విధానామే తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంటుందన్నారు. గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కోర్టు జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకలు నిర్వహించిన ఆదేశించిందని అన్నారు. శకటాల ప్రదర్శనలో తెలంగాణతో పాటూ మరికొన్ని రాష్ట్రాలకు చోటు దక్కలేదన్న ఆయన శకటం పెడితే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టాల్సి ఉంటుంని ఎద్దేవా చేశారు. ఇక ఇలా జరుగుతుంటే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయచ్చు కదా అని అడిగితే మూడు నెలలు అయితే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకు ? అని ప్రశ్నించారు. అన్ని అంశాలపై కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపుతారనీ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.