నిన్నమొన్నటివరకు రెబెల్ నేతల విషయంలో కాస్త మెత్తబడినట్లు కనిపించిన సీఎం కేసీఆర్(CM KCR).. మళ్లీ తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ.. రివెంజ్ పాలిటిక్స్ (Revenge Politics)స్టార్ట్ చేశారు.
Rekhanayak : నిన్నమొన్నటివరకు రెబెల్ నేతల విషయంలో కాస్త మెత్తబడినట్లు కనిపించిన సీఎం కేసీఆర్(CM KCR).. మళ్లీ తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ.. రివెంజ్ పాలిటిక్స్ (Revenge Politics)స్టార్ట్ చేశారు. తాజాగా పార్టీ గీత దాటిన రేఖానాయక్‌పై(Rekhanayak) గంటలోపే రివెంజ్ తీర్చుకుని.. మిగతా అసంతృప్త నేతలకు కూడా తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. మాట వినని నేతలకు భవిష్యత్‌లో కష్టాలు తప్పవని చెప్పకనే చెబుతున్నారు.
ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను(BRS Leaders) ప్రకటించిన సీఎం కేసీఆర్ పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూపారు. అయితే టికెట్ దక్కని కొంతమంది సిట్టింగులు పక్క పార్టీలవైపు చూస్తుండటంతో.. గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ఖానాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇవ్వకుండా.. మంత్రి కేటీఆర్ మిత్రుడు, ఎన్నారై అయిన జాన్సన్ నాయక్‌కు బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టికెట్ తనకు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రేఖా నాయక్ .. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఖానాపూర్ టికెట్‌కు రేఖా నాయక్.. ఆసిఫాబాద్ టికెట్ కోసం ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పదవీకాలం ముగిసిన తర్వాతే అధికారికంగా తాను బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతానని బహిరంగంగానే రేఖానాయక్ ప్రకటించారు. ఇలా ప్రకటించిన గంటలోపే రేఖానాయక్‌కు కేసీఆర్ సర్కార్ ఝలక్ ఇచ్చింది.
అయితే.. బీఆర్ఎస్ వీడుతానని చెప్పిన గంటలోపే రేఖా నాయక్ అల్లుడిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రేఖా నాయక్ అల్లుడు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను బదిలీ చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకూ మహబూబాబాద్ జిల్లాకు శరత్ ఎస్పీగా ఉన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్పీ కూడా కంగుతిన్నారు. ఇంత సడన్‌గా బదిలీ చేయాల్సిన అవసరమేంటి..? ఎవరి మీదో కోపం ఉంటే.. తనపై చూపడమేంటి..? అని తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారట.
అల్లుడిపై బదిలీ వేటుతో ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఆమె వర్గీయులు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారు. ప్రభుత్వం.. తనపై, తన కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని రేఖానాయక్ ఆవేదన చెందుతున్నారు. లాబీయింగ్ చేయకపోవడం వల్లే తనకు టికెట్ దక్కలేదని చెప్పుకొచ్చారు రేఖానాయక్. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక గొడుగు కిందకు వెళ్లకతప్పదన్నారు. ఖానాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అసలు ఎస్టీనే కాదని.. పార్టీలో లాబీయింగ్ నడుస్తోందన్నారు. అసలు కన్వెర్డెడ్ క్రిస్టియన్ జాన్సన్‌కి ఎస్టీ కోటాలో సీటు ఎలా ఇస్తారని అధిష్టానాన్ని ఆమె ప్రశ్నించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏంటో బీఆర్ఎస్‌కు చూపిస్తానంటూ సవాల్ చేశారామె. తన సాయం లేకుండా ఖానాపూర్‌లో ఎవ్వరూ ముందుకెళ్లరన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే.. మంత్రి పదవి డిమాండ్ చేస్తాననే ఉద్దేశంతో టికెట్ ఇవ్వలేదని రేఖా నాయక్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే ఈ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. రేఖా నాయక్‌తో మొదలైన కేసీఆర్ రివెంజ్ పాలిటిక్స్ మున్ముందు ఇంకా ఎవరిపైన ఉంటాయి..? ఎక్కడ ఆగుతాయి..? అన్నది వేచిచూడాలి.