Bhadrachalam : గోదావరి వరద ప్రవాహంపై సీఎం కేసిఆర్ ఆరా
KCR Reviews on Bhadrachalam Floods : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు భద్రాచలంలో వరదలు డేంజర్ లెవెల్ కు చేరుకుంటున్నాయి. గోదావరి నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో సీఎం కేసిఆర్ ఆరా తీశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద ప్రవాహం 70 అడుగుల మార్క్‌ను చేరడంతో, 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని, ఎక్కడా ప్రాణ, నష్టం ఆస్తి నష్టం జరుగకుండా తీసుకోవాలని సీఎం సూచించారు.
భద్రాచలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం కోరారు. భద్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరడంతో సోమేశ్‌కుమార్‌కు ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల సహాయ, రక్షణ చర్యలను చేపట్టిందని సోమేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.
ఊహించని వరదల వల్ల ప్రభావితమైన లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లు, రెస్క్యూ టీమ్‌లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఉపయోగపడే లైఫ్ జాకెట్లను వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించడం కోసం ఇప్పటికే ఏర్పాటు చేశారు.