Telangana MLC: తెలంగాణలో ఈ ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవకాశం!
Telangana MLC: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి లను బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈరోజు కొద్దిసేపటి ప్రకటించారు. వారిని ఈ నెల 9వ తేదీ నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చూసుకోవాల్సిందిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత బీఆర్ఎస్ అధినేత ప్రకటించనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కుర్మయ్యగారి నవీన్ కుమార్ కు కేసీఆర్ మరో చాన్సిచ్చినట్టు అయింది. సుదీర్ఘ కాలంగా కేసీఆర్ వెంట ఉన్న నవీన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
2018లో తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ ను కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన 2019 జూన్ 7లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికవగా ఇప్పుడు మరోసారి పొడిగింపు ఇచ్చారు. ఇక దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అభిమానం పొంది టీచర్ గా ఉంటూ.. సీఎంవోలో ఓఎస్డీగా పని చేసేవారు. అయితే టీచర్లను డిప్యూటేషన్ పై పంపించవద్దని సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో ఆయన తన టీచర్ పోస్టుకు రాజీనామా చేసి కేసీఆర్ వెంటే ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి లభించింది. ఇక మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమార్తె కుమారుడు , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డికి కూడా కేసీఆర్ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు.