కేసీఆర్ కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారు: లక్ష్మణ్
కేసీఆర్‌పై బీజేపీ ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు పైపైనే టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను కాంగ్రెస్ గొడుగు క్రిందికి తీసుకుపోతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి టీఆర్‌ఎస్ బి టీం అన్నారు.
మొన్నటి వరకు థర్డ్‌ఫ్రంట్ పేరుతో దేశం మొత్తం తిరిగిన కేసీఆర్.. ఆ వ్యూహం బెడిసి కొట్టడంతో pkతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్‌తో భేటీ తర్వాత టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. మూడో సారి దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని, ఎన్ని పార్టీలు ఏకమైనా బీజేపీ గెలుపును ఆపలేవన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలోనూ పొత్తులు పెట్టుకున్నట్లు లక్ష్మణ్ గుర్తు చేశారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ పెద్ద అజ్ఞాని అన్నారు లక్ష్మణ్. కేటీఆర్ టీఆర్‌ఎస్‌కు ప్రజాశాంతి పార్టీ, ఎంఐఎం పార్టీలే ప్రధాన పోటీ అనుకుంటున్నారన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.