మహాకుంభ సంప్రోక్షణ యాగంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు
ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో విశిష్టతలతో నిర్మించిన యాదాద్రి ఆలయంలో నిర్వహిస్తున్న మహాకుంభ సంప్రోక్షణ యాగానికి సీఎం కేసీఆర్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఆలయ పునః ప్రారంభానికి ముందు ఆలయంలో చేయాల్సిన పూజలను కేసీఆర్ దంపతులు నిర్వహిస్తున్నారు. ఐతే ఈ కార్యక్రమం చినజీయర్ స్వామీజీ పెట్టిన ముహూర్తం ప్రకారమే జరుగుతున్నా.. చిన్నజీయర్ స్వామీజీని మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించలేదని ఆలయ ఈవో తెలిపారు.
మరోవైపు ఆలయ నిర్మాణంలో ఒక్క ఇటుక, సిమెంట్ వాడకుండా.. అంతర్జాతీయ ప్రమాణాలతో, దాదాపు ఆరేళ్లు శ్రమించి, 850 ఎకరాల్లో ఈ టెంపుల్ సిటీని నిర్మించారు. యాదాద్రి ఆయల పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. ఆయల బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా తానే స్వయంగా ఆలయ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ యాగం నిర్వహిస్తున్నారు అర్చకులు. సాయంత్రం నుంచి ఆలయానికి సామాన్య భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.