సంచలన బాంబు పేల్చారు పట్నం మహేందర్ రెడ్డి. మంత్రి పదవి కట్టబెట్టినంత మాత్రాన రాజీపడినట్లు కాదని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
Mahender Reddy: ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డికి.. మంత్రి పదవి కట్టబెట్టి శాంతింపజేశారు గులాబీ బాస్. ఏకంగా రెండు శాఖలను కేటాయించారు. భూగర్భ గనుల శాఖ, సమాచార శాఖలను మహేందర్ రెడ్డికి కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికలు పూర్తయ్యాక.. ఎమ్మెల్సీ కూడా ఇస్తామని పట్నంకు హామీ ఇచ్చారు. అలా మహేందర్ రెడ్డిని గులాబీ బాస్ సంతృప్తి పరిచారు. కానీ అదే సమయంలో సంచలన బాంబు పేల్చారు పట్నం మహేందర్ రెడ్డి. మంత్రి పదవి కట్టబెట్టినంత మాత్రాన రాజీపడినట్లు కాదని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీంతో పట్నం చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించాయి.
అయితే మరోసారి తాండూరు టికెట్ తనకే ఇవ్వాలని పట్నం మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ వద్ద పట్టుపట్టుకొని కూర్చుకున్నారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొంది.. బీఆర్ఎస్లోకి జంప్ అయిన పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు కేసీఆర్. అంతకంటే ముందే రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు.. గులాబీ బాస్ మహేందర్ రెడ్డికి సంకేతాలు పంపించారు. ఈక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు కూడా రెడీ అయ్యారు. జిల్లాలో అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ నేతలనంతా ఏకం చేశారు. వారితో రహస్య సమావేశాలు జరిపారు. మూకుమ్మడిగా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు నేతలంతా రెడీ అయిపోయారు.
కేసీఆర్ కూడా పట్నంకు పార్టీలో ఉంటే ఉండండి.. లేకపోతే లేదనే సంకేతాలు పంపించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా కేసీఆర్ వెనుకడుగు వేశారు. ముందు నుంచి తాము చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించిన గులాబీ బాస్.. మహేందర్ రెడ్డి విషయంలో వెనక్కి తగ్గారు. పట్నంతో పాటు అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్‌లోకి వెళ్లడం.. గట్టి దెబ్బే అని భావించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టి.. పట్నంకు అవకాశం కల్పించారు. రెండు శాఖలను కేటాయించి పట్నంను శాంతింపజేశారు. రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టినంత మాత్రాన పొంగిపోనని.. పరిస్థితిని బట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడంపై నిర్ణయం తీసుకుంటానని పట్నం వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అలాగే ఆ పదవి పోయిన తర్వాత పట్నం పరిస్థితి ఏంటి అనేది కూడా చర్చనీయాంశమయింది. ఈక్రమంలో పట్నం మంత్రి పదవిలో కొనసాగుతారా.. లేదా రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.