పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరీ బెట్టు చేస్తున్నారా? తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారా? పార్టీలో చేరేందుకే ఇంతలా ఆలోచిస్తున్నారంటే.. మరి సొంతంగా అసలు పార్టీ పెట్టగలరా? గతంలో పార్టీలు పెట్టిన వాళ్లు సాధించిందేంటి..?
PONGULETI PARTY : రాజకీయాలు అంటేనే పార్టీలు మారడం (Changing parties), చేరడం ఎప్పుడూ జరిగేదే. ఆహా ఓహో అని పొగిడిన నోళ్లే తిట్ల దండకం అందుకోవడం సహజమే. ఇటీవలైతే నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారనేది కూడా తెలియడం లేదు. ఓసారి బీఆర్ఎస్, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ చివరకు అటు తిరిగి ఇటు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. గతంలో నెంబర్-2 (Number-2) స్థానాల్లో ఉన్న నాయకులు ఇలాగే ఆలోచించి పార్టీలు పెట్టారు. పెద్దగా ప్రభావం చూపలేక చేతులెత్తేశారు. అది తమ ఘనత కాదని ఆ పార్టీలో ఉండటం వల్ల దక్కిన ప్రజాభిమానమని తెలుసుకోలేకపోయారు. దేవెందర్ గౌడ్ (Devender goud), కోదండరామ్ (kodandaram) వంటి నేతలు సొంతంగా పార్టీలు పెట్టినా రాణించలేకపోయారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ కనుమరుగవగా తెలంగాణ జన సమితి పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. దాన్ని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి వంటి నాయకులు ఇలాగే పార్టీలు మారుతూ సత్తా చాటలేకపోతున్నారు. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ పేరుతో పార్టీ పెట్టినా దాన్ని చివరకు కాంగ్రెస్‌లో కలిపేశారు. ఉద్యమ సమయంలో తనవంతు కృష్టి చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta) కూడా యువ తెలంగాణ పార్టీ స్థాపించినా చివరకు బీజేపీలో విలీనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజా రాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి (Chiranjeevi) దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏపీలోనూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జనసేన (Janasena) పార్టీ పెట్టినా చంద్రబాబు వెన్నంటి నడిచేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. వైఎస్సార్టీపీ పార్టీ నెలకొల్పిన షర్మిల కూడా దాన్ని హస్తంలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ కూడా పార్టీ పెడతానని ప్రకటిస్తున్నారు. అదే కోవలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే పార్టీలు పెడుతున్న నాయకులు ప్రజాభిమానం ఎందుకు చూరగొనడం లేదు. మధ్యలోనే ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
పొంగులేటి దారెటు..?
మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఇలాగే బీఆర్ఎస్ (Brs) అధినేత కేసీఆర్‌ను (Kcr) ఢీ కొట్టారు. ఖమ్మం జిల్లాలో తనకు తాను తిరుగులేని నేతనని అంచనా వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ను గెలిపించింది తానే అని చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో పాటు పడితే తనకు అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో హంగామా చేశారు. సీఎం కేసీఆర్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన్ని అధికారం నుంచి దించడమే తన కర్తవ్యమని ప్రతినబూనారు. చివరకు అధిష్టానం ఆగ్రహానికి గురై బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అయ్యారు. అయితే పొంగులేటిని (Ponguleti) చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఇంటికి వెళ్లి మరీ రాయబారాలు నడిపాయి. ఆయన షరతులకు కూడా కొంత వరకు అంగీకరించాయి. అయినా పొంగులేటి ఎటూ తేల్చకపోవడం చర్చకు దారితీస్తోంది. తనను తాను ఎక్కువ అంచనా వేసుకోవడం వల్లే ఇలా బెట్టు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీలు పోటాపోటీగా చేరికల కోసం ప్రయత్నిస్తుండటం వల్లే పొంగులేటి డిమాండ్ చేస్తున్నారని.. లేదంటే ఆయనే ఇతర పార్టీల్లోకి బతిమాలి చేరాల్సి వచ్చేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సొంత పార్టీ పెడతారా..?
పొంగులేటి ఎటూ తేల్చకపోవడానికి తనదైన శైలిలో వివరణ ఇస్తున్నారు. గతంలో తొందర పాటు వల్ల సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. విశ్లేషణలు అన్నీ చివరి దశకు వచ్చాయట. అయితే సొంతంగా పార్టీ పెడాననేది కూడా వాస్తవం కాదంటున్నారు. ఏ పార్టీలోకి వెళ్తే ప్రధాన్యం ఎలా ఉంటుంది? ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అనుచరులకు అండ దొరుగుతుందా? ఇలా రకరకాల లెక్కలు వేసుకుంటున్నారట. వేరే పార్టీలోకి వెళ్తే ఏదో ఓ రోజు బీఆర్ఎస్లాగే బహిష్కరణో? అవమానాలో ఎదుర్కోవాల్సి వస్తే ఎలా అని మల్లగుల్లాలు పడుతున్నారట. అలాగే కాంగ్రెస్, బీజేపీలో చేరిన నాయకుల పరిస్థితిని కూడా బేరీజు వేసుకుంటున్నారట. ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్న పొంగులేటి నిర్ణయాన్ని వచ్చే నెలకు వాయిదా వేశారట. మొన్నటి దాకా కర్ణాటక ఫలితాల (Karnataka results) కోసం వేచి చూశారు. అక్కడ బీజేపీకి షాక్ తగలడంతో మళ్లీ నిర్ణయం ప్రకటించేందుకు కొంత సమయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి పార్టీ పెట్టాలంటే గతంలో స్థాపించి చేతులెత్తేసిన వారి చరిష్మా ఎంతో తేలిపోయిందనే విషయం పొంగులేటి గుర్తించినట్లున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రజాసేవ చేయాలనుకునే వాళ్లు లెక్కలు వేసుకొని రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోమటిరెడ్డి సోదరులు కూడా ఇలాగే ఊగిసలాట ధోరణి ప్రదర్శించారు. సొంత పార్టీ పెట్టేందుకు ధైర్యం చేయలేక రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఉపఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇక వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
పార్టీనా..? వ్యక్తులా..?
రాజకీయ పార్టీ స్థాపించడం అంటే మాటలు కాదు. దానికి చాలా పెద్ద యంత్రాంగమే ఉండాలి. సినిమాలో కథానాయకుడిలా కేవలం వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే ఉంటే సరిపోదు. వెన్నంటి నడిచే అనుచరులు, నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ల గలిగే కేడర్ తప్పనిసరి. లేదంటే నవ్వులపాలు కావాల్సి వస్తుంది. ఇది ఒక్క తెలంగాణ, లేదంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో ఇతర ఏ రాష్ట్రాలో అని కాదు. దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు వచ్చాయి. అంతే వేగంగా కనుమరుగు అయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించి భంగపడుతున్నాయి. కొన్ని జాతీయ పార్టీలు హోదాను కోల్పోయి ప్రాంతీయ పార్టీలకే పరిమితం అవుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్ (Kejriwal) పార్టీ ఆమ్ ఆద్మీ పంజాబ్‌లోనూ అధికారంలోకి రాగలిగింది. అలాగే జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. సుదీర్ఘ రాజకీయాల్లో ఉంటున్న సీపీఐ అదే కోవలో ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ హోదాను కోల్పోయాయి. జాతీయ పార్టీగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీ హోదాను కోల్పోయింది. ఈ పరిణామాలన్నీ చూస్తే పార్టీ పెట్టడం గొప్ప కాదు. దాన్ని నిలబెట్టుకోవడం ప్రజాభిమానం చూరగొనడం ముఖ్యమని స్పష్టమవుతోంది.