తెలంగాణలో మరో రెండు దిగ్గజ కార్పొరేట్ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థగా కొనసాగుతున్న మెట్‌లైఫ్.. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించడానికి ముందుకొచ్చింది.
Telangana : తెలంగాణలో మరో రెండు దిగ్గజ కార్పొరేట్ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థగా కొనసాగుతున్న మెట్‌లైఫ్(MetLife).. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించడానికి ముందుకొచ్చింది. అదేసమయంలో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్(GHX) అనే మరో కార్పొరేట్ సంస్థ కూడా ప్రణాళికలను వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని(New york) మెట్‌లైఫ్(Metlife) కేంద్ర కార్యాలయంలో కేటీఆర్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ఈ సంస్థ.. హైదరాబాద్‌లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
న్యూయార్క్‌లో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో మెట్‌లైఫ్ కార్యాలయ భవన రాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసేవని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అదే కేంద్ర కార్యాలయంలో ఈరోజు సొంత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. సమావేశమవడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మరోవైపు, న్యూయార్క్‌లో గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్(GHX) సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ తమ సంస్థ జీహెచ్ఎక్స్ గురించి తెలిపారు. హెల్త్ కేర్ రంగం డిజిటల్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిందని, దీంతో ఇందులోని కంపెనీలు డిజిటీలీకరణ, ఐటీ ఆధారిత సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తమ ప్రస్తుత కార్యకలాపాలను 2025 నాటికి మూడింతలు చేసే లక్ష్యంతో ఉన్నామని.. హైదరాబాద్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా తమ లక్ష్యాలను అందుకుంటామనే నమ్మకముందని సింగ్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఇంజినీరింగ్, ఆపరేషన్ కార్యకలాపాలను భారీగా విస్తారిస్తామన్నారు. తెలంగాణలో హెల్త్ కేర్ రంగానికి అద్భుతమైన అనుకూల వాతావరణం ఉందని చెప్పారు.
ఇక తమ ప్రభుత్వం ఒక వైపు హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చేయూతను అందిస్తూనే.. మరోవైపు ఐటీ ఆధారిత కార్యకలాపాలను కూడా పెద్ద ఆకర్షించేందుకు కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో సంస్థలకు, పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని వివరించారు. కాగా, ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ తెలంగాణలో తన భారీ విస్తరణకు ప్రణాళికలను ప్రకటించింది.