Inter Exams: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
Inter Exams: విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఈనెల 15వ తేదీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెన్త్ విద్యార్థులకు సైతం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఇప్పటికే పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. ఈ నెల కాలంలో విద్యార్థులు వార్షిక పరీక్షలతో పాటు అనేక ఎంట్రెన్స్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెల 15 న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 9.06 లక్షల రెగ్యులర్ విద్యార్థులుండగా, మరో 45 వేలు ప్రైవేట్ విద్యార్థులున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే కాలేజీ లాగిన్ ఐడీలో విద్యార్థుల హాల్‌టికెట్లను విడుదల చేశారు ఉన్నతాధికారులు. ప్రతి పరీక్ష కేంద్రంవద్ద 144 సెక్షన్ అమలు జరిగేలా చూస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా అధికారులుసమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశించింది.