Indrasena Reddy: టీడీపీ-బీజేపీ పొత్తు ప్రసక్తే లేదు : బీజేపీ కీలక నేత!
Indrasena Reddy Comments on Alliance: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ బీజేపీ నేత, ఇంద్రసేనారెడ్డి టీడీపీ బీజేపీ పొత్తు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన ఈమేరకు కామెంట్స్ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని బిజెపి చాలా నష్టపోయిందని, పొత్తుల వల్ల బిజెపి ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతిందని అన్నారు. మా పార్టీలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేత వరకు టీడీపీతో పొత్తుకు వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది అని పేర్కొన్న ఆయన ఆ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఈ విషయం మీద కొందరు కల్పితమైన వార్తలు రాస్తున్నారని, షర్మిల వెనక మేము ఉంటామని వచ్చిన వార్తలు కూడా అవాస్తవం అని అన్నారు. పొత్తులు పెట్టుకుని గతంలో నష్టపోయామని పేర్కొన్న ఆయన గతంలో స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే బీజేపీ బలపడేదని అన్నారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్న ఆయన బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే అని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్న ఆయన ఇది మా బలాన్ని సూచిస్తుందని అన్నారు.