అన్నదమ్ముల రక్షే శ్రీరాముడి రక్షగా ప్రతి ఆడపడుచు భావిస్తుంటుంది. ఇందుకోసం తన సోదరుడికి రాఖీ (Rakhi) కట్టేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటుంది.
Raksha Bandhan: అన్నదమ్ముల రక్షే శ్రీరాముడి రక్షగా ప్రతి ఆడపడుచు భావిస్తుంటుంది. ఇందుకోసం తన సోదరుడికి రాఖీ (Rakhi) కట్టేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటుంది. తమ పేగుబంధం కలకాలం నిలవాలని కోరుకుంటుంది. ఇలానే తన అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన ఓ సోదరికి షాక్ తగిలింది. పండుగకు ఒక్క రోజు ముందే తన అన్నను కాటికి సాగనంపాల్సి వచ్చింది. హృదయవిదారకమైన ఈ ఘటన పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో జరిగింది.
ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో కనకయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టేందుకు కనకయ్య సోదరి గౌరమ్మ దూళికట్టకు వెళ్లింది. చెల్లెలు ఇంటికి రావడంతో కనకయ్య సంతోష పడ్డాడు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో కనకయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో గౌరమ్మతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అన్న మరణాన్ని తట్టుకోలేక గౌరమ్మ కూడా సొమ్మసిల్లి పడిపోయింది. ఆ తర్వాత పుట్టెడు దు:ఖంలోనూ కడసారి తన అన్నకు రాఖీ కట్టి పేగుబంధాన్ని చాటుకుంది. వచ్చే ఏడాది రాఖీ కట్టేందుకు నా అన్న ఉండడంటూ గౌరవ్వ విలపించిన తీరు అక్కడున్న వారినందరినీ కంటతడి పెట్టించింది.