Rains Alerts in Telugu States: ఏపీ, తెలంగాణలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ఆదివారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. వెల్గటూర్, మద్దునూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరద దాటికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో నష్టం మిగిలిచ్చింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం అనకాపల్లి,అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈసమయంలో ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని సూచించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 4 తరువాత వేగంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.