IMD Alert: వాతావరణ శాఖ హెచ్చరిక..మరో రెండు రోజులు భారీ వర్షాలు
IMD Alert in Telangana : గత ఆరు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరదనీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు ఇక్కట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ గుంతలు ఉంటాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తేలిక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
గురువారం రోజున అతిభారీ వర్షాలు, శుక్రవారం రోజున ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం నాటికి ఈ వానలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంట పొలాలు మునిగిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ధరలు మండిపోతుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జులై మొదట్లో కూరగాయల ధరలు దిగొచ్చిన సంగతి తెలిసిందే. వారం తిరక్కుండానే భారీ వర్షాల ప్రభావంతో కాయగూరల ధరలకు రెక్కలు రావడం విశేషం.