YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి
High Court has given permission for YS Sharmila’s padayatra: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు అంటూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. సీఎం కేసీఆర్, రాజకీయ, మత పరమైన అంశాలపై అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని కోర్టు, పోలీసులను ఆదేశించింది. ఇక మరోపక్క హైదరాబాద్ లో షర్మిల చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సోమవారం వరంగల్ లో బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు నిరసనగా ప్రగతి భవన్ కి వెళ్లేందుకు వైఎస్ షర్మిల సిద్దమయ్యారు. నిన్న దాడికి గురైన కారులో వెళ్తున్న ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయినా ఆమె కారు దిగలేదు. ట్రాఫిక్ జామ్, శాంతి భద్రతల సమస్యల పేరుతో పోలీసులు షర్మిల కారులో ఉండగా కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కార్యకర్తలు నిరసనకు దిగారు.