HC Orders: సీఎస్ సోమేష్ కు హైకోర్టు షాక్.. ఏపీకి కేటాయింపు
High Court Cancelled CS Somesh Kumar Allotment for Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగలింది. 2014 రాష్ట్ర విభజన సమయంలో డీఓపీటీ సోమేష్ ను ఏపీకి కేటాయించింది. అయితే, సోమేష్ కుమార్ తనకు ఏపీ కాకుండా తెలంగాణలో కొనసాగించాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీని పైన క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిది. తెలంగాణలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సీనియర్టీ ప్రకారం ప్రస్తుతం సోమేష్ కుమార్ సీఎస్ గా కొనసాగుతున్నారు.
ఇదే అంశం పైన తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. క్యాట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ కేడర్ కు సోమేష్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ, ఏపీలో కొనసాగేలా న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీంతో, ఈ తీర్పు మూడు వారాలు అమలు నిలిపివేయాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాత ఆదేశాల అమలు పైన క్లారిటీ రానుంది.
తెలంగాణ ప్రభుత్వ విధానాల్లో పాలనా అధికారిగా కీలక హోదాలో ఉన్న సోమేష్ కుమార్ కేడర్ ను రద్దు చేయటంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది అధికార వర్గాల్లో చర్చగా మారింది. సోమేష్ దీని పైన సుప్రీంకు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వంలోని ముఖ్యులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలను అమలు చేయటంలో సీఎస్ పాత్ర కీలకం. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సోమేష్ తదుపరి అడుగుల పైన స్పష్టత రావాల్సి ఉంది.