Heavy Rains: తెలుగు రాష్టాలకు వర్షసూచన
Heavy Rains తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రాతో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉంటుందని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, డా.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లి, కరీంనగర్‌లలో కూడా వర్షాలు మరింత భారీగా కురుస్తాయని తెలిపారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.