Seasonal Diseases: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు
Telangana Seasonal Diseases: తెలంగాణలో ఒకపక్క విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. మరోపక్క సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతోన్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు రాష్ట్రంలో డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాప్తి చెందుతోందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కలుషిత నీరు వల్ల టైఫాయిడ్ వ్యాప్తి చెందుతోన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. రోడ్లపై పానీపూరితో పాటు తోపుడు బండ్లపై ఈగలు, దోమలు వాలే పదార్థాలను తినడం వల్ల ఈ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు తెలిపారు.
రోడ్లపై ఉండే తిను బండారాలకు ప్రజలు దూరంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. వర్షాకాలంలో తిను బండారాలపై ఈగలు అధికంగా వాలుతున్నాయి. దీనివల్ల విష పూరిత జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలను బయట తిరగకండా చూడాలని, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల్లో నీరు చేరింది.