Harish Rao: ఇక వారందరికీ సీపీఆర్ ట్రైనింగ్: హరీష్ రావు
Harish Rao: మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఈఎంఆర్ఐ క్యాంపస్ లో జరుగుతున్న సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచన కేటీఆర్ దేనని కేటీఆర్ మామ గుండెపోటుతో చనిపోయిన రోజు ఎవరు సీపీఆర్ చేయలేదు, సీపీఆర్ చేయక పోవడం వల్ల ఆయన చనిపోయారని అన్నారు. ఇక 15 లక్షల మంది దేశంలో… ఒక రోజు నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్ట్ కు గురవుతున్నారని, ఈ సీపీఆర్ చేస్తే 10 మందిలో 9 మందిని కాపాడవచ్చని who స్పష్టం చేసిందని అన్నారు.
గోల్డెన్ అవర్ లో సీపీఆర్ చేస్తే ఎంతో మందిని కాపాడవచ్చన్న ఆయన 24 వేల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో చనిపోతున్నారుని, అందుకే గేటెడ్ కమ్యూనిటిలో ఉండే వారికి, మాల్స్ లో, బస్తీల్లో ఉండే వారికి, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉద్యోగులకు సీపీఆర్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. ప్రజల విలువైన ప్రాణాలు కాపాడటమే సీపీఆర్ ట్రైనింగ్ లక్ష్యమన్న ఆయన ప్రస్తుతం మనుషుల ఆహారపు అలవాట్లు మారాయి, ఇతర కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు, దీని వల్ల సమస్యలు వస్తున్నాయని అన్నారు.
1200 AED లను 18 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయాలని వైద్యశాఖ నిర్ణయించారని, రాబోయే రోజుల్లో AED కచ్చితంగా పెట్టాలనే నిబంధనలు తీసుకువస్తామని అన్నారు. మనిషికి పరిశుద్ధమైన గాలి, నీరు, ఆహారం కావాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడింటిని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని మార్పులు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్న ఆయన ప్రతి రోజు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాలని కోరుతున్నానని అన్నారు. సీపీఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.