Harish Rao: తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి హరీశ్‌రావు.. హీటెక్కుతున్న రాజకీయం
Harish Rao meets Tummala Nageshwar Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీశ్ రావు వెళ్లడం చర్చనీయాంశం అయింది. పార్టీ ట్రబుల్ షూటర్‌గా చెప్పుకునే మంత్రి హరీశ్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లడంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌కు దూరమవుతున్న సంకేతాలు వస్తున్న క్రమంలో హరీష్ రావు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ, 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ సభను విజయవంతం చేయమని కోరేందుకే హరీశ్ రావు .. తుమ్మల ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. మంత్రి హరీశ్ రావు వెంట, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెళ్లారని అంటున్నారు. తుమ్మలపై కొన్ని రోజులక్రితం సండ్ర పరోక్ష విమర్శలు చేసిన క్రమంలో ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.