Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా..హరీశ్ రావు వరుస ట్వీట్లు!
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా పై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో కేంద్రం ప్రకటన పై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జాతీయ హోదా కోసం కేంద్రానికి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని రాజకీయ కక్షతో జాతీయ హోదాని కేంద్రం ఇవ్వలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకు మాత్రం హోదా ఇచ్చారని కేంద్రం వివక్ష ఈ రేంజ్ లో ఉందని అంటూ మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవమన్న ఆయన వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని, కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ – బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టిందని ఆయన అన్నారు.