Minister Harish Rao: తెలంగాణలో డెంగ్యూ, మలేరియా నిర్మూలనకు తక్షణ చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై పోరాటానికి ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో నమోదౌతున్న కేసులను గుర్తించిన తర్వాత ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. ఈ విషయమై మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు మలేరియా తగ్గుముఖం పట్టిందని.. ఈ ఏడాది ములుగు, భద్రాద్రి కొత్త గూడెంలో మలేరియా కేసులు గుర్తించామని మంత్రి తెలిపారు. డెంగ్యూ కేసులు ఎక్కువుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. వర్షాలు బాగా పడిన తర్వాత సీజనల్ డిసీజెస్ పెరిగే అవకాశం ఉంటుందని, ఇటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. జిల్లా స్థాయిలో, గ్రామస్థాయిలో అన్ని రకాల టెస్టింగ్ కిట్స్ అందుబాటులో పెట్టినట్లు మంత్రి తెలిపారు.
దోమలను నివారించడానికి పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖ, ఆరోగ్యశాఖలు కలిపి కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్లి దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. మంచినీళ్ల ద్వారానే దోమల వ్యాప్తి జరగుతోందని, కాబట్టి నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలను కోరారు. ఇంటి ఆవరణలో ఉండే పలు వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని మంత్రి సూచించారు. డెంగ్యూ దోమలు ఇంటి ఆవరణలోనే పెగుగుతాయని మంత్రి తెలిపారు.
ప్రతి ఆదివారం ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామ పంచాయితీలో ప్రభుత్వ అధికారులు వెళ్లి నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. భారీ స్థాయిలో శుభ్రతా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. డెంగ్యూ దోమలు మన ఇంటి ఆవరణలోనే, మంచి నీటిలోనే పుడతాదని అలా జరగకుండా చూడాలంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మంత్రి కోరారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రతి శుక్రవారం ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు వెళ్లి అక్కడ శుభ్రతా కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ఫ్రై డే ను డ్రై డేగా నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
యాంటీ లార్వా యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులను కోరిన విషయాన్ని కూడా మంత్రి వెల్లడించారు. ప్రజలు వ్యాధుల బారిన పడితే వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.