TRS Ex Mla Resign:టీఆర్ఎస్ పార్టీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
తెలంగాణలో అధికార పార్టీనుంచి పలువురు నేతలు బయటకు వెళ్తున్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌కు చెందిన కార్పోరేటర్ విజయ రెడ్డి అధికార పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరగా.. తాజాగా ఆశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం పార్టీని విడుతున్నట్లు తెలిపారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఆయన.. ప్రభుత్వం స్పందిచకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అశ్వారావు పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో అదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రస్తుతం తాటి వెంకటేశ్వర్లు రాజకీయ భవిష్యత్తుపై నిలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు తాటి వెంకటేశ్వర్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో తుమ్మల సొంతూళ్లోనూ టీఆర్ఎస్‌కు ఓట్లు పడలేదని ఆయన ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే సత్తా తుమ్మలకు లేదన్నారు. పార్టీ కీలక నేతలు సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయానని ఆయన చెప్పారు. నాయకులందరినీ కలుపుకుని జిల్లా నేతలు ముందుకు సాగాలని ఇటీవలి ఖమ్మం పర్యటనలో కేటీఆర్ చెప్పారని, కానీ కేటీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు.