తెలంగాణ అభివృద్ధికి రైతులే కీలకం: కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కిటెక్స్ టెక్స్ టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా పరిశ్రమకు భూములిచ్చిన రైతులకు కేటీఆర్ పాదాభివందనాలు తెలిపారు. భూములు ఇవ్వడం మామూలు త్యాగం కాదన్న ఆయన.. భూములు ఇచ్చిన రైతుల రుణం తీర్చుకోలేనిదన్నారు. భూములు ఇచ్చిన రైతులకు నగరంలో 100 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.
మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అన్నారు. ఇక్కడ రానున్న రోజుల్లో అన్ని పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. హైదరాబాద్ లాగే వరంగల్ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం నగరంలో టైక్స్‌టైల్స్ పరిశ్రమ వచ్చిందన్న ఆయన.. ఇలాగే రానున్న రోజుల్లో అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు ఐకియా లాంటి పెద్ద సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.