Konda Surekha: ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి కొండా సురేఖ రాజీనామా
Ex Minister Konda Surekha resigned from executive membership
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలే ప్రకటించిన రాష్ట్ర కమిటీలపై మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడంపై తీవ్ర నిరాశ చెందారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా తాను కొనసాగలేనని స్పష్టం చేశారు. ఆ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కొండా సురేఖ తెలిపారు.
తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్థాపం కలిగించిందని కొండా సురేఖ తన లేఖలో వివరించారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ లో తన కంటే జూనియర్లను నామినేట్ చేశారని, తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనను నియమించడం అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్తల కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు.