Telangana : యూనివర్సిటీ నియామకాలపై సర్కారు కీలక ఉత్తర్వులు
యూనివర్సిటీ నియామకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ నియామకాల కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మినహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో వేగవంతమైన నియామకాలను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం కేంద్రీకృత బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 ప్రకారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా నియమించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ను బోర్డు కన్వీనర్‌గా నియమించారు. అవసరం అనుకుంటే మరో సభ్యుడిని నియమించుకునేందుకు కూడా ప్రభుత్వం ఈ బోర్డుకు వెసులుబాటు కల్పించింది. ఇక బోర్డు రూల్స్ ఏంటి ? నియామక ప్రక్రియ ఎలా చేపట్టబోతున్నారు ? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ కు సంబంధించి దాదాపు 1000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.