Eknath Shindes in TRS: కేసీఆర్ కు పొగబెట్టే “షిండే” లు ఎవరు. ఏం జరుగుతోంది.
Shindes in TRS: BJP hits out KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబ పాలన..అవినీతి అంటూ టార్గెట్ చేస్తూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఏక్ నాధ్ షిండే పేరును తెలంగాణలో ప్రస్తావిస్తోంది. అందునా టీఆర్ఎస్ లో షిండేలు ఉన్నారంటూ మైండ్ గేమ్ ప్రారంభించింది. తాజాగా సీఎం కేసీఆర్ సైతం ఇదే అంశం పైన రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో షిండేలు వస్తారని చెబుతున్నారని, తీసుకురావాలని సవాల్ చేసారు. తమతో గోక్కుంటే అగ్గి పుట్టిస్తామని, తమతో గోక్కో కున్నా..తాను మాత్రం గోకుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. దీనికి స్పందనగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అల్లుడు, కొడుకు, బిడ్డలో ఎవరైనా షిండేలు కావొచ్చు అంటూ బండి వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చటానికి రెడీ అయ్యారన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో … ఎప్పుడు ఊడుతుందోనని టీఆర్ఎస్ పార్టీలో నేతలే అనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీసాయి. మరో ఏడాది కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ముందస్తు ఎన్నికల పేరుతో రాజకీయంగా సవాళ్లు మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా షిండేలు టీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా , అసమ్మతి రాజకీయాలు చేసే సాహసం చేస్తారా అంటే లేదనే వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
2001 లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్నారు. 21 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నారు. తెలంగాణ సాధించిన గుర్తింపుతో రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. రెండో సారి సీఎం అయిన తరువాత చాలా రోజులు హరీష్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. ఆ సమయంలోనూ హరీష్ తాను సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే కేసీఆర్ కారణమని పలు సందర్భాల్లో వివరించారు. కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన సందర్భంలో నూ ఇదే రకమైన చర్చలు జరిగాయి. కానీ, హరీష్ తన విధేయత చాటుకున్నారు. ఇక, కేటీఆర్ పాలనా పరమైన నిర్ణయాలు – హైదరాబాద్ వ్యవహారాలను చూస్తున్నారు.
మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు – పార్టీలో సమస్యల పరిష్కారానికి హరీష్ ట్రబుల్ షూటర్ గా పార్టీలో పేరు ఉంది. అదే సమయంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ సైతం విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎవరి విమర్శలను కేసీఆర్ సీరియస్ గా తీసుకోరు. అదే సమయంలో తాను చేయాలనుకున్నది చేసేందుకు దేనికైనా సిద్దపడతారనేది వారి విశ్లేషణ. ఇలా..ఒంటి చేత్తో పార్టీని – ప్రభుత్వాన్ని నడిపిస్తూ…ఒక విధంగా తెలంగాణలో ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నార్ధకం చేసిన కేసీఆర్..తన సొంత పార్టీలో షిండేలు తయారైతే ఉపేక్షిస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలు పార్టీలో ఎవరైనా అంత సాహసం చేయగలరా అనేది మరో సందేహం. ఇదంతా.. బీజేపీ రాజకీయంగా ఆడుతున్న మైండ్ గేమ్.. టీఆర్ఎస్ పైన బ్లేమ్ గేమ్ గా రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.