సాధారణంగా చిన్నపిల్లలు పోలీసులంటే భయపడుతుంటారు. వారు కనిపిస్తే చాలు ఆమడదూరం పారిపోతారు. కానీ ఇప్పుడున్న పిల్లలు పోలీసులను ఫ్రెండ్స్ గా ఫిలవుతున్నారు.
Kamareddy: సాధారణంగా చిన్నపిల్లలు పోలీసులంటే భయపడుతుంటారు. వారు కనిపిస్తే చాలు ఆమడదూరం పారిపోతారు. కానీ ఇప్పుడున్న పిల్లలు పోలీసులను ఫ్రెండ్స్ గా ఫిలవుతున్నారు. మనకు అన్యాయం జరిగితే న్యాయం చేసేది పోలీసులేనని గట్టి నమ్మకం వారికేర్పడింది. తాజాగా పిల్లలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి పిర్యాదులు కూడా చేస్తున్నారు. స్కూల్లో సార్ కొడుతున్నాడంటూ ఓ చిన్నారి.. తమ ఏరియాలో గొడవలు జరుగుతున్నాయంటూ మరో చిన్నారి.. డైరెక్టుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఫిర్యాదులు చేస్తూ.. పోలీసులే ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి తనతండ్రిపై కేసుపెట్టింది. మా నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు అంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన లతీఫ్, ఇర్ఫానా అనే దంపతులు తమ కుమార్తె ఫాతిమాతో కలిసి ఉంటున్నారు. అయితే లతీఫ్ మద్యానికి బానిసగా మారాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి ఇర్ఫానాను హింసిస్తూ, కొడుతున్నాడు. దీంతో ఫాతిమా తన తల్లిని నాన్న కొడుతున్నాడంటూ బీర్కూర్ పోలీసు స్టేషన్‌కు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక నుంచి పిర్యాదు అందుకున్న వెంటనే ఇర్ఫానా, లతీఫ్ దంపతులను పోలీస్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి తాగి ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. లతీఫ్ కు కౌన్సిలింగ్ ఇచ్చిపంపించారు.