Kavitha in BRS: బీఆర్ఎస్ లో కవితకు కీలక బాధ్యతలు..ఆ రాష్ట్రానికి ఇంచార్జ్ గా?
Crucial Role for Kavitha in BRS: తెలంగాణ రాష్ట్రమే పరమావధిగా కేసీఆర్ చే స్థాపించబడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్టకేలకు 2014లో కొత్త రాష్ట్రాన్ని సాధించడమే కాదు రాష్ట్రం ఏర్పాటయ్యాక తర్వాత ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. 2018లో ఇంకా ఏడాది గడువు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మరోసారి తెలంగాణలో తెరాస జెండా ఎగరవేశారు. అయితే కేవలం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే సస్యశ్యామలమైతే ఎలా? మిగతా రాష్ట్రాల వారిని కూడా బాగు పరచాలని అంటూ కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ లాంచ్ చేశారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పేరు రిజిస్టర్ అయింది, ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించే పనిలో పడ్డారు కేసీఆర్. అయితే తాజాగా ఈ బీఆర్ఎస్ లో కేసీఆర్ కుమార్తె, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల కవితకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్తగా కేసీఆర్ త్వరలోనే కవితను అనౌన్స్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక ఈ ప్రచారానికి ఊతమిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆయనతో పాటు పార్టీలో చేరిన మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి, రావేల కిషోర్ బాబు వంటి వారు శనివారం నాడు కవితతో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయం మీద వీరి మధ్య చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఖమ్మంలో 18వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సహకారం కావాలని మీరు పోషించాల్సిన పాత్ర ఇదే అంటూ కవిత వారికి కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బిఆర్ఎస్ లో ఏపీ నుంచి చేరబోయే కొత్త నేతల వ్యవహారం మీద కూడా కవిత కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలుగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో చేయాల్సిన పర్యటనలు, ఎవరెవరు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకోవడం సహ ఎవరిని పార్టీలోకి తీసుకుంటే పార్టీకి ప్లస్ అవుతుందనే విషయాన్ని కూడా త్వరలోనే తనకు సమర్పించాల్సిందిగా ఆమె కోరినట్లు తెలుస్తోంది.
అయితే పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న నేతలకు సంబంధించిన వివరాలు ఆమె దృష్టికి తీసుకువెళ్లిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తాను ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలోని కొంతమంది కాపు నేతలతో టచ్ లో ఉన్నానని వారి వివరాలు కూడా తోట చంద్రశేఖర్ కవిత ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వివరాలన్నీ అందుకున్న తరువాత కవిత ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం బహిరంగ సభ అయిన తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కు సమన్వయకర్తగా కవితను కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు, కుదిరితే అదే రోజున సభలోనే ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు అనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ లో చేరికలు విస్తరణ వంటి అంశాల మీద కవితతో ముగ్గురు నేతలు చర్చించారని ఈనెల 29వ తేదీ కవిత ఏపీలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.