Minister Harish Rao: కరోనాపై వైద్యులకు హరీష్ రావు కీలక ఆదేశాలు
Expedited Delivery of Booster Doses: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సైతం కొత్త కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బూస్టర్ డోసుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనికోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్యాధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ప్రజలకు కోవిడ్ ఫస్ట్ డోస్ మాత్రమే వేశారని, సెకండ్ డోస్ తీసుకోని వారు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని, వారికి కూడా కోవిడ్ సెకండ్ డోస్ వేయాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అధికారులు కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుందని, అధికారులు అంటీ ముట్టనట్లు ఉండవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరికీ బూస్టర్ డోస్‌ను వేయాలని మంత్రి సూచించారు.