Congress Padayatra: తెలంగాణ కాంగ్రెస్ లో మరో పాదయాత్ర
Congress Padayatra: తెలంగాణ కాంగ్రెస్ లో మరో పాదయాత్ర తెర మీదకు వచ్చింది. రేవంత్ రెడ్డి ఒక వైపు… మహేశ్వర్ రెడ్డి మరో వైపు పాదయాత్ర చేయబోతున్నారు అని తెలుస్తోంది. రేవంత్ యాత్ర ఫర్ చేంజ్ పేరుతో యాత్ర చేస్తుండగా తెలంగాణ పోరు యాత్ర పేరుతో మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర జరగనుందని అన్నారు. మార్చి 3 నుంచి యాత్ర జరగనుందని ప్రతి నియోజకవర్గంలో ఒకటి..రెండు రోజులు చేస్తామని పేర్కొన్నారు. ముగింపు గాంధీ భవన్ లో ఉంటుందని, పీసీసీ రూట్ వేరు.. మా రూట్ వేరు మెదక్..జహీరాబాద్ మీదుగా మా యాత్ర అని ఆయన అన్నారు.
మార్చి 1 నుంచి కోదాడ లో ఉత్తమ్ పాదయాత్ర కూడా మొదలు కానుందని తెలుస్తోంది. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా రెండు వారాల పాటు సాగిన పాదయాత్రలో మంచి జోష్ వచ్చింది, రాహుల్ గాంధీపై చాలా పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది.. దాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు తెలంగాణ నేతలు పని చేయాల్సి ఉంటుందని ఓ అంచనాకు వచ్చే ఈ మేరకు ముందుకు వెళుతున్నారు అని తెలుస్తోంది. పార్టీలో మరో సీనియర్ నేత.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారు, గతంలో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేశారు. హైకమాండ్ అనుమతి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు కానీ ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.