కాంగ్రెస్ ఆశావాహులంతా దరఖాస్తు చేసుకోవాలని కోరగా.. వేల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు.. పెద్ద ఎత్తున ఎన్నారైలు దరఖాస్తు చేసుకున్నారు.
Congress: తెలంగాణలో ఎన్నికల గాలి వేగంగా వీస్తోంది. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలయింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకముందే రాజకీయ పార్టీలు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. కొత్తకొత్త వ్యూహాలతో హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రేపో.. మాపో మిగిలిన నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. ఈక్రమంలో బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహాలను రచిస్తోంది. సమర్థులయిన అభ్యర్థుల కోసం జల్లెడ పడుతోంది. ఈ మేరకు ఆశావాహులంతా దరఖాస్తు చేసుకోవాలని కోరగా.. వేల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు.. పెద్ద ఎత్తున ఎన్నారైలు దరఖాస్తు చేసుకున్నారు.
ఎనిమిదిరోజుల పాటు ఆశావాహుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. మరీ ఎక్కువగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నారైలు తరలి వచ్చారు. విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా వచ్చి అప్లై చేసుకున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా ఎన్నారైల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గానూ.. మొత్తం 1020 అప్లికేషన్స్ వచ్చాయి. అత్యధికంగా ఇల్లందు నుంచి 38 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన స్థానాల్లో పదుల సంఖ్యలో అధిష్టానానికి దరఖాస్తులు అందాయి. ఇక మంథని.. కొడంగల్ నుంచి మాత్రం కేవలం ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే అందాయి. మంథని నుంచి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు.. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
పెద్ద ఎత్తున ఆశావాహులు, ఎన్నారైలు, నేతలు దరఖాస్తు చేసుకునేందుకు తరలివస్తే.. ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాలేదు. వీహెచ్ హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డి, గీతారెడ్డి, రేణుకా చౌదరి వంటి సీనియర్ నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. వీహెచ్ హనుమంతరావు రాజ్యసభ లేదా లోక్‌సభ ఆశిస్తున్నారట. అలాగే రేణుక చౌదరి ఖమ్మం పార్లమెంట్ నుంచి.. గీతా రెడ్డి జహీరాబాద్ నుంచి ఎంపీలుగా పోటీచేయాలనుకుంటున్నారట. అటు మాజీ మంత్రి జానారెడ్డి దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ.. ఆయన ఇద్దరు కుమారులు అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో వారంతా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు సినీనటుడు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయిపోతున్నారు. గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే అంతకంటే ముందే రాహుల్ సిప్లిగంజ్ అధిష్టానంతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అతనికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం కూడా పచ్చజెండా ఊపిందట. గోషామహల్ నుంచి సరైన అభ్యర్థి రాహుల్ సిప్లిగంజ్ అని కాంగ్రెస్ భావిస్తోందట. ఈక్రమంలో రాహుల్ గాంధీ దరఖాస్తు చేసుకున్నారట. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ అధిష్టానానికి 1020 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎవరికీ టికెట్ దక్కుతుంది.. ఎవరికి నిరాశే ఎదురవుతుందనేది ఆసక్తిగా మారింది.