T Congress: నేడు కరీంనగర్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ..హాజరుకానున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్
T Congress: హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నక్రమంలో కరీంనగర్ లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ జిల్లాల నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కరీంనగర్ చేరుకుంటున్నారు. ఈ బహిరంగ సభకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న పథకాల విషయమై కాంగ్రెస్ నేతలు ఈ సభ ద్వారా ప్రకటన చేసే అవకాశం ఉంది. హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రేవత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఇక రేవంత్ రెడ్డి ఈ సభ నిర్వహణను దగ్గరుండి పరిశీలించారు.
కరీంనగర్ పట్టణంలోని అంబేడ్కర్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. మొదట కాంగ్రేస్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఆ తరువాత షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. సాయంత్రం 4 నుంచి 9 గంటల వరుకు సభ నిర్వహించుకోవచ్చని అనుమతులిచ్చారు. అయితే ఎటువంటి ర్యాలీలు చేయకూడదని ఓ నిబంధన పెట్టారు. ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే సభ విజయవంతం కోసం నేతలందరు సిద్ధమయ్యారు. కరీంనగర్ సభకు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రకటిస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.