నల్గొండ కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు..
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే అన్ని వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రప్పించుకొని పార్టీ నేతల మధ్య మనస్పర్దలు ఉండవద్దని తెలిపిన రాహుల్.. పార్టీకోసం కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి పని చేయాలన్నారు. అయినా పార్టీలో విభేదాలు మాత్రం బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నేతలపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో డాక్టర్ రవిని పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నట్టు అధిష్టానానికి తెలిపారు. 2018 ఎన్నికల్లో రవి పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెండ్ అయారని గుర్తు చేశారు. రవిని మళ్లీ పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.