Cold Wave in Telangana: పెరుగుతున్న చలి..గజగజ వణుకుతున్నభాగ్యనగరం
Cold Wave in Telangana: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి అధికమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిదిలోపు, సాయంత్రం ఆరు తర్వాత జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.
ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే రాష్ట్రంలో అత్యల్పం. హైదరాబాద్‌లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీలకు పడిపోయింది. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా 10 డిగ్రీలలోపే రికార్డు అయింది. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటుతున్న చలి తీవ్రత తగ్గడం లేదంటున్నారు
ఇక నగరంలో కూడా చలి పెరిగిపోవడంతో రద్దీగా ఉండే రోడ్లు రాత్రి పూట 8 గంటలకే కాలిగా కనబడుతున్నాయి. రాబోయే మూడు రోజుల వరకు గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది.
ఆదివారం నగరంలో గరిష్ఠం 28.3, కనిష్ఠం 12.8 డిగ్రీలు నమోదయింది. రాత్రి 7 నుంచి ఉదయం 8 గంటల వరకు శీతలగాలులు గజగజలాడిస్తున్నాయి. తెల్లవారుజామున 4 నుంచి 6.30 గంటల వరకు పొగమంచు కురుస్తుండడంతో హైవేలపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.