రేపే స్వయంభువుల దర్శనం.. యాదాద్రికి సీఎం కేసీఆర్
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభువుల దర్శనాలకు సమయం ఆసన్నమవుతోంది. సోమవారం ఆలయ ఉద్ఘాటన ఘనంగా జరగనుంది. ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం మొదలు కానుంది. ఆ తర్వాత ఆలయంలో దైవ దర్శనాలను అనుమతించనున్నారు. ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర, 11:55 గంటలకు మహా కుంభ సంప్రోక్షణ, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభువుల దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం ప్రధానాలయం దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుడతారు. ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపైనా స్వర్ణ కలశాలకు మహాకుంభ సంప్రోక్షణ ఒకేసారి 92 మంది రుత్వికులు నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొంటారు. విమానం, గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు కొనసాగిస్తారు. ఇక దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. గర్భాలయంలోని స్వయంభువులకు తొలిపూజ చేపట్టి కేసీఆర్ దర్శించుకోనున్నారు.