తెలంగాణాలో ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా గతంలోనే రూపకల్పన చేసిన గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇక మరోవైపు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
Telangana Govt: తెలంగాణాలో ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా గతంలోనే రూపకల్పన చేసిన గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఇక మరోవైపు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా మారిన పోడు భూముల సమస్యల పరిష్కారానికి సుదీర జాప్యం తరువాత ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసిఆర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న లబ్ధిదారులకు సైతం.. రాష్ట్రంలోని మిగతా రైతులకు అందిస్తున్న మాదిరిగానే రైతుబంధు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమ చేస్తుందని సీఎం తెలిపారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4లక్షల ఎకరాలకుపైగా 1.55లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిశీలించింది. ఇందుకు సంబంధించి పట్టాలను సైతం అధికారులు సిద్ధం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13.18లక్షల ఎకరాల పోడు భూములకు చెందిన రైతులకు 2021 నవంబర్ 8నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఈ సందర్భంగా 2450 గిరిజన గ్రామాల్లో పోడు భూముల సమస్యలున్నట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఎకరాల పోడుభూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా, అటవీ అధికారుల దర్యాప్తులో 80 శాతం మంది అనర్హులన్న విషయం తేటతెల్లమైంది. దీనితో అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత ఆలస్యమయ్యేలా కనపడుతోంది. పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా గిరిజనేతరులు కావడం గమనార్హం. అటవీ హక్కుల చట్టం 2005 కు లోబడి పట్టాల పంపిణీ జరుగుతుంది. దీనిప్రకారం ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు నుండే గిరిజనలు ఆ భూములను సాగు చేస్తుండాలి. గిరిజనేతరులు అయితే చట్టం అమల్లోకి రావడానికి 75 యేండ్ల ముందు నుండీ ఆ భూములను సాగు చేస్తుండాలి. అధికారులు చెప్తున్న ప్రకారం.. వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే మెజారిటీ దరఖాస్తుదారులు 3 నుండి 4 యేండ్ల క్రితం నుండే పోడు భూములను సాగు చేస్తున్నట్లు తెలిసింది. మరికొంతమంది సాగు చేయబట్టి సంవత్సరం కూడా కాలేదు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు 80 శాతం మందికి పైగా అనర్హులున్నట్లు అటవీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు అర్హులైన వారిని గుర్తించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
పోడు భూములకు పట్టాలు ఒకవైపైతే మరోవైపు..అర్హులైన పేదలకు గృహలక్ష్మి పథకం కింద భూములివ్వాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం గృహలక్ష్మి పథకం అమలు చేయనుంది. మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే గృహలక్ష్మి అమలుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదటగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా 3వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొదట విడతలో ఈ పథకం ద్వారా మూడు లక్షల 50 వేల మందికిపై లబ్ది పొందే అవకాశం ఉంది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తించనుంది. 3 లక్షలను మూడు దఫాలుగా లక్ష చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అందుకోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లను కేటాయించింది.
ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో పెండింగ్‌లో ఉన్న ఒక్కో పనిని చేసుకుంటూ వెళుతుంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు నిధులను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీలకు నిధులురాక గ్రామా సర్పంచులు అందరు ఏకమై బిల్లులకోసం ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. పలుమార్లు ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నపించుకున్న తరుణంలో ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆనందాన్ని వ్యక్తం చేసారు. మరో వైపు రైతు రుణమాఫీ పై కూడా మరో రెండు రోజుల్లో మంచి కబురు వినిపిస్తోందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక ఇన్నిరోజులనుండి పెండింగ్ లో ఉన్న పనులను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది కాబట్టి.